సీబీఐ పేరుతో ఫోన్ కాల్..మహిళ నుంచి రూ.25 లక్షలు కాజేసిన నేరగాడు

ఇటీవల సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు కాజేసిన వారు..ఇప్పుడు పోలీసుల పేరుతో ఫోన్లు చేసి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఓ మహిళకు సీబీఐ పేరుతో ఫోన్ కాల్ చేసి ఏకంగా రూ.25 లక్షలు కాజేసాడు. ఈ ఘటన ఏలూరు లో చోటుచేసుకుంది. పట్టణంలోని విద్యానగర్ కు చెందిన పాము సెల్వా రోజ్లిన్ కు అపరిచిత వ్యక్తి నుండి ఈ నెల 18వ తేదీన ఫోన్ కాల్ వచ్చింది. మేం సీబీఐ నుండి ఫోన్ చేస్తున్నామంటూ.. మాటలు ప్రారంభించిన ఆ వ్యక్తి.. మీ పేరిట ఓ కొరియర్ వచ్చిందని.. అందులో.. పాస్‌పోర్టు, పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్ ఉన్నాయని నమ్మించారు.

అంతేకాదు.. మీపై కేసు నమోదు చేస్తున్నామని బెదిరింపులకు దిగాడు.. వీడియో కాల్ చేసి పార్సిల్‌ను.. అందులో ఉన్న వస్తువులు ఇవేనంటూ చూపించాడు.. దీంతో.. సదరు మహిళ బెదిరిపోవడంతో.. ఆ భయాన్నే క్యాష్‌గా మార్చుకోవలన్న ఆలోచనతో ఉన్న ఆ కంత్రీగాడు.. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని భయపెట్టాడు. ఊహించని పరిణామంతో హడలిపోయిన సదరు బాధితురాలు.. ఆ కేటుగాడు చెప్పిన బ్యాంకు ఖాతాకు.. దపదపాలుగా ఏకంగా రూ.25,60,500 పంపింది.. తర్వాత మోసపోయానని గ్రహించి.. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.