పెన్షన్ విషయంలో ఏపీ సర్కార్ రికార్డ్స్

పెన్షన్ విషయంలో ఏపీ సర్కార్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 4వేలతో పాటు.. గత మూడు నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తం రూ. 7వేల పింఛన్ ను అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు నిన్నటి నుండి అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు.

గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయగా.. ఈసారి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి జులై పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజులోనే 94 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఏపీలో మొత్తం 65,18,496 మంది పింఛనుదారులు ఉండగా, వారిలో 61 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91 శాతం మందికి పెన్షన్లు ఇచ్చారు.