మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌ దగ్గర మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి గాలి దుమారానికి మరోసారి కూలింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా టేకుమట్ల మండలంలోని గర్మి ల్లపల్లి- పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెన గ్యాడర్లు (బెడ్లు) మంగళవారం సాయంత్రం వీచిన గాలికి (ఓడేడు-గరిమెళ్ళపల్లి పరిధిలో) కూలిపోయాయి. తాత్కాలిక రోడ్డుపై పడ్డగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2016లో ఆగస్ట్‌ నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించేందుకు ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణ సమయంలో వచ్చిన వరదలకు సామాగ్రి దెబ్బతినడం, కాంట్రాక్టర్లు మారడంతో పనులు లేట్ అవుతున్నాయి. రెండేళ్లుగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గడ్డర్లు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1,2 నంబరు పిల్లర్ల నాలుగు గడ్లర్లు కిందపడ్డాయి. ఇప్పుడు మరో ఐదు గడ్డర్లు కిందపడడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాద సమయంలో తాత్కాలిక రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.