నేటి నుంచి పెద్దగట్టు జాతర ఆరంభం – 20వ తేదీ వరకు కొనసాగనున్న భక్తి ఘట్టం. తెలంగాణలో మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో జరగనున్న ఈ జాతర ఐదు రోజులపాటు భక్తుల హర్షాతిరేకాల మధ్య నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుండి 15 లక్షల మందికి పైగా భక్తులు హాజరుకానున్నారు.

ట్రాఫిక్ మార్గాల మళ్లింపు:
జాతర నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి వచ్చింది. హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మార్గంగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గంలో మళ్లించబడతాయి.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను జాతీయ రహదారి 365-బీబీ మీదుగా మళ్లించనున్నారు.
సూర్యాపేట-కోదాడ వెళ్ళే వాహనాలను కోదాడ, మునగాల, గుంపుల, ఎస్సారెస్పీ కెనాల్, బీబీగూడెం మార్గంగా మళ్లించనున్నారు. ఆర్టీసీ బస్సులకూ ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు.
జాతర విశేషాలు:
ఈ జాతర 400 ఏళ్ల చరిత్ర కలిగి, మేడారం జాతర తరహాలో రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. నేడు రాత్రి సూర్యాపేట మండలం కేసారం నుంచి చౌడమ్మ తల్లి దేవరపెట్టె ఊరేగింపుగా పెద్దగట్టుకు రానుంది. నేడు రాత్రి గంపల ప్రదక్షిణతో జాతర ప్రారంభం ,రెండో రోజు చౌడమ్మ తల్లికి బోనాల సమర్పణ, మూడో రోజు చంద్రపట్నం కార్యక్రమాలు, నాలుగో రోజు దేవరపెట్టెను కేసారం తరలింపు ,ఐదో రోజు జాతర ముగింపు ఉంటుంది.
భద్రతా ఏర్పాట్లు:
భక్తుల రద్దీకి అనుగుణంగా 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అదనపు సీసీటీవీ కెమెరాలు, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సూర్యాపేట నుంచి 60 బస్సులు ,కోదాడ నుంచి 15 బస్సులు
భక్తులకు విజ్ఞప్తి .పెద్దగట్టు జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు భక్తులు పోలీసుల సూచనలను పాటించాలని కోరుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దగట్టు జాతర అనేది కేవలం భక్తుల ఆరాధనా కార్యక్రమమే కాకుండా, తెలంగాణ సంప్రదాయాల భవ్యతకు అద్దం పట్టే విశేషమైన ఉత్సవం. వేలాది మంది భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోవటానికి, ఆలయ దివ్య శోభను అనుభవించటానికి జాతరలో పాల్గొంటారు. ఈ పవిత్రమైన వేడుకను సాంప్రదాయ పద్దతుల్లో, భక్తి పరవశతతో నిర్వహించాలి. జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజనలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితం కానుంది.
పెద్దగట్టు జాతర తెలంగాణ ఆధ్యాత్మిక శోభను, సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప ఉత్సవం. భక్తులు భక్తి భావంతో పాల్గొని, భద్రతా సూచనలు పాటిస్తూ, పవిత్రమైన వేడుకను ఆరాధనతో ముగించాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీలింగమంతులు స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ పరస్పర సహాయ సహకారాలతో జాతరను ఆధ్యాత్మికంగా విజయవంతం చేసుకోవాలి.