కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం షాక్‌కు గురిచేసింది. మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు హాజరుకావడానికి వెళ్తుండగా సింధనూరు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఈ విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతిని చాలా బాధకరమని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. చిన్న వయసులోనే విద్యార్థులు ఇలాంటి దుర్ఘటనకు గురవడం చాలా బాధాకరమని పవన్ అన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబాలకు ధైర్యం చెప్పడం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలాంటి ప్రమాదాలు ఇకముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై మరింత దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.