కీలక పత్రాల కాల్చివేత ఫై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం

నిన్న రాత్రి విజయవాడ లోని అరకట్ట వద్ద ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. ఫైళ్లు, రిపోర్టులు దగ్ధం చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు.

దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రికార్డులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? ఫైళ్లు, రిపోర్టులు భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధానాలను తెలపాలని అధికారులకు సూచించారు.

అర్థరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి కీలకమైన ఫైల్స్ ను దగ్ధం చేస్తుండగా.. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరు ప్రస్తుతం యనమలకుదురు పోలీసుల ఆధీనంలో ఉన్నారు. పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు. ఫైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ఆదేశాల ప్రకారం దగ్ధం చేశారు? అనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.