సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పైనా పవన్ సమీక్ష

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్..తన పనిలో బిజీ అయ్యారు. అన్ని శాఖల అధికారులతో నిన్నటి నుండి మాట్లాడుతూ..పలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పైనా ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదాం… ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్-2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకుని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ఇందువల్ల రాబోయే తరాల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం త్వరలోనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.