ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ క్యాబ్​ డ్రైవర్స్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏపీ క్యాబ్​ డ్రైవర్స్ కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేసారు. హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌ కళ్యాణ్ కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుందని తెలిపారు. అక్కడి ప్రాంతం, ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారని చెప్పారు.

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య తన దృష్టికి వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయని, ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదని తెలిపారు.