పరిస్థితి ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్ కల్యాణ్

జనసేన సభకు భూమి ఇచ్చారనే అక్కసుతోనే ఇళ్లను తొలగించారని ఆగ్రహం

Jana Sena chief Pawan Kalyan visits Ippatam village

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ విపక్ష నేతలు, కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేసిన వాళ్లు మాత్రమే మనవాళ్ళు, వేయని వాళ్లు మన శత్రువులు అనే విధంగా జగన్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. మన వాళ్లు కాని వాళ్లని తొక్కి నార తీయండి అనే విధంగా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. తాము ప్రజలందరికీ పాలకులం కాదని… తమకు ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులమని వారు భావిస్తున్నట్టు వారి చర్యలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఈరోజు ఆయన మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పర్యటించారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. మార్చి 14న జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారన్న అక్కసుతోనే ప్రజల ఇళ్లను కూల్చి వేశారని మండిపడ్డారు.

ఇప్పటం గ్రామం ప్రధాన రహదారికి దూరంగా ఉంటుందని… వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉండవని పవన్ తెలిపారు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల వెడల్పు రోడ్డు ఉందని… ఇప్పుడు దాన్ని 120 అడుగుల రోడ్డుగా మార్చేందుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఉవ్విళ్లూరుతున్నారని దుయ్యబట్టారు. రోడ్డు వెడల్పు పేరుతో వారికి ఓటు వేయని వారి ఇళ్లను తొలగిస్తున్నారని చెప్పారు. అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేస్తున్నారని… సామాన్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు.

మరోవైపు ఇప్పటం గ్రామానికి బయల్దేరిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనాలను ఆపేశారు. దీంతో పవన్ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత కారుపైకి ఎక్కి ఇప్పటంకు పయనమయ్యారు. ఇప్పటంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/