డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్‌ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి సంతకం తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన ఫైల్‌పై చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1,2 అధికారులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12:30కి పంచాయతీ రాజ్ సెక్రటరీ అసోసియేషన్ తో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విజయవాడలో ఉన్న జలవనరులశాఖకు చెందిన ఇరిగేషన్‌ కాంప్లెక్స్‌లోని క్వార్టర్లను డిప్యూటీ సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కేటాయిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.