పిఠాపురంలో 1 నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వ‌హించ‌నున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. మూడు రోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. ఈ నెల 29న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పూజాదికాలు నిర్వహిస్తారు.

ఇక నిన్న మంగళవారం క్యాంపు ఆఫీస్ లో జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరూ సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ సూచించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలన్నారు.

గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం ఉందన్న పవన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీపడ వద్దన్నారు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడవద్దన్నారు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారిని గుర్తించి, వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.