మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్

యావత్ తెలుగు ప్రజానీకం ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ పవన్ నోటా వినిపించడంతో మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం లో కీలక పాత్ర పోషించడమే కాదు బరిలో నిల్చున్న తన పార్టీ సభ్యులు 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ బరిలో విజయం సాధించి 100 % విజయం తో చరిత్రలో నిలిచారు పవన్ కళ్యాణ్.

ఇక ఈరోజు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన సతీమణి అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు, మోడీ ల వద్దకు వెళ్లిన పవన్ కల్యాణ్ వారితో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు పవన్ కల్యాణ్ నమస్కరించారు. సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.