ఇప్పటం బాధితులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం: జనసేనాని

త్వరలో అందజేస్తారని వెల్లడించిన నాదెండ్ల మనోహర్

pawan-kalyan-announced-1-lakh-for-ippatam-villagers

అమరావతిః ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను జనసేన తరఫున ఆదుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంగళవారం వెల్లడించారు. ఈమేరకు ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం వివరాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలిపారు.

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇండ్లను కూల్చివేశారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. జనసేన ఆవిర్భావ సభకు సహకరించారని ఇప్పటం వాసులపై ప్రభుత్వం కక్షగట్టిందని జనసేన నేతలు మండిపడ్డారు. సభకు స్థలం ఇచ్చారని ఇళ్లను కూలగొట్టడం దుర్మార్గమని విమర్శించారు. పోలీసు బలగాలను మోహరించి మరీ జేసీబీలతో ఇళ్లను కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించడం ఉద్రిక్తతలకు దారితీసింది. బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లి పవన్ వారిని పరామర్శించారు.

మంగళవారం పార్టీ నేత నాదెండ్ల మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్నవారిని జనసేన ఆదుకుంటుందని చెప్పారు. బాధితులకు తనవంతుగా అండగా నిలబడాలని పార్టీ చీఫ్ నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగా.. బాధితులకు పవన్ కల్యాణ్ లక్ష రూపాయల చొప్పున సాయం ప్రకటించారని వివరించారు. ఈ మొత్తాన్ని పవన్ కల్యాణ్ తన చేతులతో త్వరలో బాధితులకు అందజేస్తారని నాదెండ్ల వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/