అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గిఫ్ట్ కార్డులలో డబ్బు జమ చేయడం చాలా సులభమైన ప్రక్రియ అని, అయితే కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిలోని డబ్బును వెనక్కి తీసుకోవడం యూజర్లకు తీవ్రమైన సమస్యగా మారిందని పవన్ అన్నారు. గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, కాలం చెల్లిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ను తిరిగి పొందే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. యూజర్లు తమ సమస్యను కస్టమర్ కేర్ కు వివరించడంతో పాటు, సుదీర్ఘమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుందన్నారు.

పవన్ అభిప్రాయ ప్రకారం.. గిఫ్ట్ కార్డులో మిగిలి ఉన్న బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా యూజర్ ఖాతాలోకి జమ కావడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా యూజర్ల సమయం ఆదా అవుతుందని, అలాగే వారి డబ్బును కోల్పోయే అవకాశాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ-కామర్స్ పోర్టళ్లకు బాధ్యతాయుతమైన మరియు పారదర్శక విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ సూచించారు. గిఫ్ట్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు సులభతర మార్గాలను అన్వేషించాలని, తద్వారా యూజర్లలో నమ్మకం పెరిగేలా చూడాలని సూచించారు. ఈ అంశంపై పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేశారు.