ఆయన చెప్పినట్లే ప్రెస్‌మీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా
హైదరాబాద్: వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్‌మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి అంగీకరించారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవారని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలిగించాలనే కుట్రతోనే వారితో కుమ్మక్కై ప్రెస్‌మీట్లలో ఈ వ్యాఖ్యలు చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టైన పోసాని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరిస్తూ… నేరాంగీకారపత్రంపై సంతకం చేశారు.

ప్రతి ప్రెస్‌మీట్‌కు ముందు ఆయన నాకు స్క్రిప్ట్ పంపేవారు
పోలీసులు కోర్టులో సమర్పించిన నేరాంగీకారపత్రంలోని ప్రధానాంశాలివీ.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆయన భార్య, పిల్లల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడాను. ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టాను. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యానించాను. మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశా. అశ్లీల పదజాలంతో మహిళలనూ దూషించాను. వీరందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డే. ప్రతి ప్రెస్‌మీట్‌కు ముందు ఆయన నాకు స్క్రిప్ట్ పంపేవారు. ఆయన అనుమతితోనే రెచ్చగొట్టేలా మాట్లాడేవాణ్ని అన్నారు.
వారితో కుమ్మక్కై, వారి ప్రోద్బలంతోనే కులాల మధ్య చిచ్చు
2014 నుంచి నేను వైసీపీకీ మద్దతుదారును. రాజకీయంగా, సామాజిక మాధ్యమాల్లో ఆ వర్గాలతో కలిసి పనిచేస్తున్నా. వారితో కుమ్మక్కై, వారి ప్రోద్బలంతోనే కులాల మధ్య చిచ్చుపెట్టేలా, ప్రజల్ని రెచ్చగొట్టి, గొడవలు సృష్టించేలా ప్రెస్‌మీట్లలో కుట్రపూరిత వ్యాఖ్యలు చేశా. చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపిక కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది ఒకే కులానికి చెందినవారేనంటూ అసత్య ప్రచారం చేసి నంది అవార్డు తిరస్కరించా. సినీ పరిశ్రమలో కొన్ని కులాల ఆధిపత్యం ఉందంటూ.. ఓ కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాను. సినీ అభిమానులు, రాజకీయ పార్టీలు, కులాల మధ్య విభేదాలు తలెత్తాలనే ఇలా మాట్లాడాను అన్నారు.