జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు హృదయపూర్వక సందేశం ఇచ్చారు. బహిరంగ లేఖ ద్వారా పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా శ్రేణులకు బాధ్యతాయుతమైన ఆచరణ పద్ధతులను సూచించారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని, కూటమి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలసిన ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయాన్ని పవన్ చారిత్రాత్మకంగా అభివర్ణించారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న నిరంకుశత, అవినీతి, శాంతిభద్రతల వైఫల్యాలకు విసిగిపోయిన ప్రజలు ఎన్డీయే కూటమిని ఆశ్రయించారని పవన్ తెలిపారు. ఈ విజయంలో జనసేన పార్టీ తన 100 శాతం విజయాన్ని నమోదు చేయడం ప్రత్యేకమైన ఘనత అని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నట్లు పవన్ వివరించారు. 7 నెలల వ్యవధిలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మారుమూల గ్రామాల్లో కూడా మౌలిక వసతుల కల్పన జరుగుతోందని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అయితే, కూటమి శ్రేణులు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు లేదా కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరచవద్దని పవన్ స్పష్టం చేశారు. విభేదాలు ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవంలో భవిష్యత్ లక్ష్యాలపై సమగ్ర చర్చ జరగబోతుందని పవన్ తెలిపారు. “పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు; నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం,” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందేశంతో పార్టీ శ్రేణులకు ఒక తార్కాణం చూపిస్తూ, కూటమి ఉనికి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.