రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 23 వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు.. 6 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా సిద్ధంగా ఉంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దేశంలో సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్కేస్, వరుస రైలు ప్రమాద ఘటనలు, పెరిగిన ధరలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.

కాగా లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలపగా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్. మరి ఈసారి ప్రతిపక్షాలకు అధికార పార్టీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.