న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న “పరీక్షా పే చర్చ” ఈ ఏడాది కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. అయితే మోడీతో పాటు ఈసారి బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సద్గురు జగ్గీ వాసుదేవ్, నటీనటులు దీపికా పదుకొణె, విక్రాంత్ మస్సే, భూమి పడ్నేకర్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్, పారా అథ్లెట్ అవని లేఖరా, రచయిత రుజుతా దివేకర్, ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలీ సబర్వాల్, ఫుడ్ ఫార్మర్ రేవంత్ హిమత్‌సింగ్కా, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌధరీ వంటి ప్రముఖుల పాడ్‌కాస్ట్ ఎపిసోడ్స్‌ను ప్రదర్శించనున్నారు. వీరు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపనున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే పరీక్షా పే చర్చ ఇప్పటికే ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో 8వ ఎడిషన్ జరగనుంది. అయితే ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలని అధికారులకు మోడీ సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖులను చర్చలో భాగం చేయనున్నారు. మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరినీ పీపీసీ కిట్స్‌ను కేంద్ర విద్యా శాఖ అందించనుందని సమాచారం. అలాగే.. లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్‌గా ఎంపిక చేసిన 10 మందికి ప్రధాని నివాసం సందర్శించే అవకాశం కల్పించనున్నారు.
కాగా, పరీక్షా పే చర్చ కోసం గతేడాది డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. .జనవరి 24 ఉదయం 10గంటల వరకు వరకు దేశ వ్యాప్తంగా 9.72లక్షల మంది విద్యార్థులు, 1.01లక్షల మంది టీచర్లు, 24,289మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయినట్లు అధికారులు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు 2500 మందిని ఎంపిక చేస్తారు. వారికి కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్‌లు అందిస్తారు. పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు https://innovateindia1.mygov.in/లో ఆన్‌లైన్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న(MCQ)లతో ఓ పోటీ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులు ప్రధానితో నేరుగా జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానమిస్తారు. విద్యార్థులకు తగిన సూచనలు చేస్తారు.