భారీ వర్షం కారణంగా చంద్రబాబు, పవన్ ల పల్నాడు పర్యటన రద్దు

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దైంది. రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో సభా ప్రాంగణం బురదమయం కావడంతో ముందు జాగ్రత్తగా అధికారులు పర్యటనను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం కాకాని JNTU కాలేజీలో జరిగే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబులు హాజరుకావాల్సి ఉంది. అటు మరోచోట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

నరసరావుపేట మండలం కాకానిలో వనమహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే నరసరావుపేటలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా సభాప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్ని బురదమయమయ్యాయి. సభ కోసం జర్మన్‌ టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ వర్షపు నీరు సభా ప్రాంగణంలోకి చేరింది. సభికుల కోసం వేసిన కుర్చీలు భూమి లోపలికి దిగబడిపోతున్నాయి. అలాగే పార్కింగ్‌ ప్రాంతమంతా బురదమయం కావడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. దీంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది అవుతుందని అధికారులు భావించి సభ రద్దు చేస్తే బాగుంటుందని చెప్పడం తో సభ రద్దు చేసారు.