ఏపీ టీడీపీ చీఫ్ పల్లాకు బుల్లెట్ ప్రూఫ్ కారు

ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్ఠానం బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక MLA పల్లా శ్రీనివాసురావు యాదవ్ని చంద్రబాబు నియమించారు. ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఏపీ పునర్విభజన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా, ఇది మూడోసారి కావడం విశేషం.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లా అనేక ఇబ్బందులకు గురయ్యారు. వైసీపీ రాగానే ఆ పార్టీ నేతలు పల్లాను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఏయూలో పనిచేస్తున్న ఆయన సతీమణితో ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. విజయసాయిరెడ్డితో అన్నివైపుల నుంచి పొగపెట్టారు. అయినా పల్లా పార్టీని వీడలేదు.