టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక MLA పల్లా శ్రీనివాసురావు యాదవ్ని చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నూతన బాధ్యతలను శ్రీనివాసరావు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఏపీ పునర్విభజన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా, ఇది మూడోసారి కావడం విశేషం.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లా అనేక ఇబ్బందులకు గురయ్యారు. వైసీపీ రాగానే ఆ పార్టీ నేతలు పల్లాను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఏయూలో పనిచేస్తున్న ఆయన సతీమణితో ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. విజయసాయిరెడ్డితో అన్నివైపుల నుంచి పొగపెట్టారు. అయినా పల్లా పార్టీని వీడలేదు.