జనవరి నాటికి ఉల్లి ధరలు దిగొస్తాయి : కేంద్రం అంచనా

Onions
Onions

న్యూ ఢిల్లీః మొన్నటి దాక ఆకాశాన్నంటిన టమాట ధరలు ప్రజలను బెంబేలెత్తించాయి. ఇక ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. కిలో ధర చాలా ప్రాంతాల్లో రూ.80 దాటింది. హైదరాబాద్​లో కిలో ఉల్లి రూ.50కు అమ్ముడుపోతోంది. ఇక రోజురోజుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. మరోవైపు వచ్చే ఏడాది జనవరి నాటికి పెరిగిన ఉల్లి ధరలు మరింత దిగొస్తాయని అంచనా వేసింది.

జనవరిలో కిలో ఉల్లి ధర రూ.40 కంటే దిగువకు వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కిలో ఉల్లి సగటు ధర రూ.57.02గా ఉండగా.. దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80 దాటింది. మండీల్లో రూ.60పైనే పలుకుతోంది. కొంతమంది కిలో ఉల్లి ధర రూ.100 దాటుతుందని అంటున్నారని.. కానీ రూ.60 దాటదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్ వెల్లడించారు. ఎగుమతులపై నిషేధం వల్ల రైతులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.