మరోసారి ఢిల్లీ ర్యాలీకి సిద్ధమైన రైతు సంఘాలు

Once again the farmers’ associations are ready for the rally in Delhi

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల ‘ఢిల్లీ చలో’ సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇతర దిగ్బంధనాలను తొలగించిన తర్వాత.. మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిని తెరిచిన వెంటనే రైతులు మళ్లీ చలో ఢిల్లీ చేపడుతారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా సిద్ధూపూర్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా(నాన్‌ పొలిటికల్‌) నేత జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మంగళవారం వెల్లడించారు.

పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు రైతాంగ ఉద్యయం ఆగేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని శంభు సరిహద్దు వద్ద రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లో తొలగించాలని పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఇటీవల హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో దల్లేవాల్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో ఎస్కేఎం(నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(కేఎంఎం) ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ను పోలీసులు పంజాబ్‌-హర్యానాలోని శంభు సరిహద్దు వద్ద అడ్డుకోవడంతో ఆ నెల 13 నుంచి రైతులు అక్కడే బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.