సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చినట్లు ప్రచారం జరుగగా..ఇప్పుడు సచివాలంయలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఐదో అంతస్తుకు మార్చనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి చాంబర్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి, సలహాదారులు ఆరో అంతస్తులోనే కొనసాగుతారని, ఇతర కార్యదర్శుల పేషీలు ఐదో అంతస్తుకు తరలిస్తారని వినికిడి.

ఐదో అంతస్తులో వారం రోజుల్లో పనులు మొదలు కానున్నట్టు మాట్లాడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, రోజూ ఏదో ఒకచోట, ఎవరో ఒకరు ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా కూడా వాస్తు లోపమే అని అందుకే మార్పులు చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ చేస్తున్న ఈ మార్పులతో బీఆర్ఎస్ హయాంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన మార్పులను మళ్లీ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ఎవరైనా సరే ఇలా వాస్తు మార్పులు, చేర్పులు మామూలే అన్నట్లుగా జనాలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కూడా తెలంగాణ భవన్‌కు కేసీఆర్ మార్పులు చేసిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో వాస్తు మార్పులు గట్టిగానే జరుగుతున్నాయని మాట్లాడుకుంటున్నారు.