మను బాకర్‌ కు ఘన స్వాగతం పలికిన స్వదేశీయులు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించి స్వదేశంలో అడుగుపెట్టిన సందర్బంగా ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంతో భారత షూటర్‌ మను బాకర్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ప్రతిఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బుధువారం ఆమెతో పాటు ఆయన కోచ్​ జస్పల్​ రానాకు స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఢిల్లీ ఎయిర్​పోర్ట్​ దగ్గర ఘన స్వాగతం లభించింది. చాలా మంది ఆమెను చూసేందుకు, ప్రశంసించేందుకు తరలివచ్చారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్దాలతో హోరెత్తిస్తూ పూల వర్షం కురిపించారు. అందరూ మను బాకర్​ ఫొటోలు ఉన్న ఫ్లకార్డులు పట్టుకుని సందడి చేశారు. డప్పు శబ్దాలకు కేరింతలు కొడుతూ చిందులు వేశారు. ఆమె మెడలో పూల దండలు వేసి సత్కరించారు. దేశానికి రెండు మెడల్స్ తీసుకువచ్చిన మనూను మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

పారిస్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో మను బాకర్‌ రెండు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని ముద్దాడింది. అయితే, ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్ మెడ‌ల్స్ కొట్టే అవ‌కాశాన్ని మను చేజార్చుకుంది. ఈవెంట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న ఆ షూట‌ర్.. 25మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య ప‌త‌కాన్ని మిస్ చేసుకుంది. దీంతో రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు పతకాలతోపాటు ఎన్నో రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుని భారత్‌ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది