న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల ఫలితాలు రాగానే కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడాబయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో జీఏడీ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. సెక్రటేరియట్ ను సీజ్ చేశారు. పలు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినపుడు ఫైళ్లు చోరీకి గురవుతూ ఉంటాయి. ఢిల్లీలో అలా జరగకూడదని బీజేపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెబుతున్నారు.

కేజ్రీవాల్ సీఎంగా ఉన్నపదేళ్ల కాలంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని బీజేపీ విమర్శిస్తోంది. ఎన్నికల సమయంలో ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే.. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే.. ఆప్ ప్రభుత్వం ఓడిపోతుందని క్లారిటీ రాగానే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సెక్రటేరియట్ సీజ్ ఆదేశాలు ఇచ్చారు. సెక్రటేరియట్‌లోని ఫైల్స్, రికార్డ్స్ జాగ్రత్త చేయాలని ఒక్కటి కూడా మిస్ కాకూడదన్నారు. ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు.
భద్రతా కారణాలు, రికార్డ్స్ రక్షణ కోసం.. ఢిల్లీ సచివాలయం కాంప్లెక్స్ నుంచి జీఏడీ అనుమతి లేకుండా ఒక్క ఫైల్ గానీ, డాక్యుమెంట్ గానీ, కంప్యూటర్ హార్డ్‌వేర్ సహా ఏది బయటికి వెళ్లకూడదని జీఎడీ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్‌ను మూసివేసి.. అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని పలు డిపార్ట్‌మెంట్‌ల పరిధిలోని రికార్డులు, ఫైల్‌లు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఫైల్‌లను భద్రపరుచుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఇంఛార్జ్‌లకు సూచనలు చేసింది. సచివాలయ కార్యాలయాలకే కాకుండా మంత్రుల మండలి క్యాంప్ కార్యాలయాలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. సీఎం అతిశీ చాంబర్ ను కూడా సీజ్ చేయనున్నారు.