మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్ష’ లో క్షుద్రపూజలు జరిగాయంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పదవిలో తానే కొనసాగాలనే ఆకాంక్షతో మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే ఈ పూజలు నిర్వహించారని అన్నారు. ఇందులో భాగంగా దున్నపోతులను బలిచ్చి వాటి కొమ్ములను బంగ్లా ఆవరణలో పాతిపెట్టించారని అన్నారు. సీఎం సీటు తనకే దక్కాలని, వేరే వ్యక్తి ఆ సీటులో ఎక్కువ కాలం కొనసాగ వద్దనే ఉద్దేశంతో షిండే ఈ పని చేశారని ఆరోపించారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలోకి మారడానికి ఇష్టపడడంలేదని సంజయ్ చెప్పారు. గతేడాది డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటి వరకు అధికారిక బంగ్లాలోకి మారలేదు. ఇప్పటికీ సాగర్ బంగ్లాలో నుంచే విధులు నిర్వహిస్తున్నారు.సంజయ్ రౌత్ ఆరోపణలపై తాజాగా సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. క్షుద్రపూజల ఆరోపణలను కొట్టిపారేశారు. తన కూతురు ప్రస్తుతం పదో తరగతి చదువుతోందని, త్వరలో పరీక్షలు ఉండడంతో అధికారిక బంగ్లాలోకి మారేందుకు సమయం తీసుకుంటున్నానని చెప్పారు. కూతురి పరీక్షలు పూర్తయ్యాక వర్ష లోకి షిఫ్ట్ అవుతామని వివరించారు.
ప్రస్తుతం అధికారిక నివాసంలో షిండే ఉన్నారని, అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నాయని ఫడ్నవీస్ గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పందిస్తూ.. క్షుద్ర పూజలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న వారికి ఇలాంటి వ్యవహారాలలో బాగా అనుభవం ఉండి ఉండొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.