ప్యోగ్యాంగ్ : ఉత్తర కొరియా – దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఇరుదేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది.
దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని.. ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా యూఎస్ మిలటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్ ఓ ప్రకటలో పేర్కొంది. ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా నార్త్ కొరియా అభివర్ణిస్తోంది.
అయితే.. 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని కిమ్ రాజ్యం రద్దు చేసుకోవాలని భావించింది. అంతేకాక, దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని నిర్ణయించింది. పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ అధికారికంగా ప్రకటించాల్సిఉంది. కానీ, సమావేశాలు మంగళవారంతో ముగిసినప్పటికీ.. దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఉత్తర కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా సరిహద్దును పూర్తిగా మూసేందుకు సన్నాహాలు చేస్తోందని ఆ దేశ సైన్యం తాజాగా వెల్లడించింది.
రోడ్డు, రైలు మార్గాలను నిలిపివేసి బలమైన రక్షణ నిర్మాణాలతో తమ ప్రాంతాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో సరిహద్దును పటిష్టం చేసే పనిలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు కొందరు పేలుళ్ల కారణంగా మరణించారు. అదే నెలలో రెండు కొరియాలను కలిపే రైల్వే లైన్లలోని భాగాలను ఉత్తర కొరియా కూల్చివేస్తోందన్న సంకేతాలను గుర్తించినట్లు సియోల్ గూఢచారి సంస్థ తెలిపింది. తమ శత్రు దేశంతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసి.. రాకపోకలను నివారించేందుకు ఉత్తర కొరియా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.