వరదల ఎఫెక్ట్: 30మంది ప్రభుత్వ అధికారులకు ఉరిశిక్ష విధించిన ఉత్తర కొరియా

North Korea allegedly executes 30 government officials for flood failures

ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియాలో మరణశిక్ష అనేది చట్టపరమైన శిక్ష. భారీ దొంగతనం, హత్య, అత్యాచారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, రాజద్రోహం, గూఢచర్యం, రాజకీయ అసమ్మతి, ఫిరాయింపులు, పైరసీ వంటి అనేక నేరాలకు ఉత్తర కొరియా దేశంలో మరణ శిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 30 మంది ప్రభుత్వ అధికారులను ఉరితీశారు. చాగాంగ్ ప్రావిన్స్ లో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేక మంది మరణించగా.. గాయాల పాలయ్యారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనను నియంత్రించడంలో విఫలమైన 30 మంది అధికారులను గత నెలలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఉరితీసింది.

ఉత్తరకొరియాలోని వాయువ్య ప్రావిన్స్ జులై నెలలో తీవ్ర వరదలతో దెబ్బతింది. వేలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. అనేక మంది మరణించగా.. వందల మందికి గాయాలయ్యాయి. సినుయిజులో జరిగిన అత్యవసర సమావేశంలో.. విపత్తును అరికట్టడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశించారు. దీంతో 30 మంది అధికారులకు ఆగస్టు చివరి వారంలో ఉచితీసినట్లు తెలిసింది. మరోవైపు.. చాగాంగ్ ప్రావిన్స్ పార్టీ సెక్రటరీ కాంగ్ బాంగ్-హూన్ పైనా దర్యాప్తు ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఏడాది జూలై నెలలో దక్షిణ కొరియా డ్రామాలను వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసినట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రువుగా ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే.