ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు మూడో విడత పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత పార్టీ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన ఈసారి నామినేటెడ్ పోస్టులు ఎవరికో తేల్చిచెప్పేసారు. వారి పేర్లనే తనకు సూచించాలని కూడా నేతలకు క్లారిటీ ఇచ్చేశారు.
ఇవాళ టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.

2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలన్నారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామని, ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం…ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు. గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారని, వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయం అని చంద్రబాబు తెలిపారు.