భద్రాచలం గోదావరి వద్ద సెల్ఫీ దిగితే పోలీస్ స్టేషన్ కే..

గోదావరిలో వదర ఉధృతి భద్రాచలంలో జిల్లా రెవెన్యూ అధికారుల పలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోందని ..ఇప్పటికే గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉందని… ఈ క్రమంలో గోదావరి బ్రిడ్జి పై సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని..ఎవరైనా దిగితే పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని హెచ్చరించారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 6 గంటలకు 46.70 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి. వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చర్ల మండలం వద్ద ఈత వాగు పైనుంచి వరదనీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీత వాగు గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగిపోయింది. భద్రాచలం నుంచి ఛత్తీస్​గఢ్​, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తోంది.