వర్షాల ఎఫెక్ట్ : అధికారులకు సెలవులు లేవు – మంత్రి గొట్టిపాటి రవి

గత నాల్గు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారటంతో వానలు కురుస్తున్నాయి. కాగా, నేడు కూడా ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని వెల్లడించింది.

ఇక రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు చేసారు మంత్రి గొట్టిపాటి రవి. వర్షాల ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై 8500001912కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని, 1912 నంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు.