దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో పోలీసుల అత్యుత్సాహం

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమ్మె బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ..వెంటనే నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేర్చాలంటూ వారంతా ఆందోళనలు , ధర్నాలు , నిరసనలు చేస్తూ వస్తున్నారు. అయితే నిరుద్యోగుల పోరాటం ప‌ట్ల పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా ఎల్‌బీన‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ నుంచి దిల్‌సుఖ్‌న‌గ‌ర్ మెట్రో వ‌ర‌కు పోలీసులు భారీగా మోహ‌రించారు. మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు నిర్వహిస్తూ.. నిరుద్యోగులను మెట్రో ఎక్కనివ్వడం లేదు. నిరుద్యోగుల ఫోన్ల‌ను త‌నిఖీ చేస్తూ…వారి వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి నిరుద్యోగుల గ్రూపులు లేక‌పోతేనే వారిని మెట్రోలో ప్ర‌యాణించేందుకు అనుమ‌తిస్తున్నారు. టీజీఎస్‌పీఎస్సీ ముట్ట‌డికి పిలుపునిచ్చిన నేప‌థ్యంలో నిరుద్యోగుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై నిరుద్యోగులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

మరోపక్క ప్రభుత్వ తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాపాలనలో నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కులేదా..? అని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు.