మీడియా కు క్షేమపణలు తెలిపిన నీతా అంబానీ

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట ఏడెనిమిది నెలలుగా జరుగుతున్న పెళ్లి వేడుకలు నిన్న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగిశాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా అనంత్-రాధిక వివాహం నిలిచింది. మొత్తం వేడుకలకు రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, పాప్ సింగర్లు, హాలీవుడ్, బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, క్రీడా, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వేడుకలకు హాజరయ్యారు. ఈనెల 12న ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలైన ఈ వేడుకలు 13వ తేదీన ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, 14వ తేదీన ‘మంగల్‌ ఉత్సవ్‌’తో గ్రాండ్‌గా ముగిశాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ వేడుకలను దేశంతోపాటు విదేశీ మీడియా కూడా పెద్ద ఎత్తున కవర్‌ చేసింది.

ఈ నేపథ్యంలో వేడుకల చివరిరోజైన నిన్న ‘మంగళ ఉత్సవ్’ కార్యక్రమంలో నీతా అంబానీ మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంత్- రాధిక పెళ్లి సమయంలో మీడియా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. అనంత్‌ – రాధిక పెళ్లికి మీరంతా వచ్చి వేడుకల్లో భాగమయ్యారు. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకల్లో ఏదైనా అనుకోకుండా తప్పులు జరిగి ఉంటే అందుకు క్షమించండి. పెళ్లి ఇంట్లో పొరపాట్లు జరగడం సాధారణమే. మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. అదేవిధంగా ఇవాళ జరిగే వేడుకలకు మీడియా మిత్రులను నీతా అంబానీ అతిథులుగా ఆహ్వానించారు. ‘మీరు రేపు మా అతిథులుగా రండి. మీ అందరికీ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. మరోసారి అందరికీ ధన్యవాదాలు’ అని నీతా అంబానీ పేర్కొన్నారు.