రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాల పుట్ట. ఆయన మాటలు, కదలికలు ఎప్పుడు కొత్త సంచలనాలు సృష్టిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆయనలో కొంత మార్పు కనిపిస్తోందా అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. వర్మ రాత్రి చెప్పింది పొద్దున్నే మార్చేసే స్వభావం కలిగిన వ్యక్తి అని ఇండస్ట్రీలో చాలా మంది చెప్పుకుంటారు. “ఆర్జీవీ మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లే!” అనే ముద్ర ఆయనపై ఉంది.
కానీ ఇప్పుడు ఆ ముద్రను తీసేయాలని, గౌరవాన్ని పెంచే సినిమాలు తీయాలని వర్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు.1998లో విడుదలైన సత్య సినిమా 27 సంవత్సరాల తర్వాత తిరిగి విడుదల అయింది.ఈ సందర్భంగా ఆ సినిమా చూసిన వర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ట్విట్టర్లో పెద్ద లేఖ రాసి, సత్య మరియు రంగీలా వంటి క్లాసిక్ సినిమాలు తీయగలిగిన దర్శకుడిగా మొదట్లో ఉన్న తాను, తర్వాత కాలంలో ఎలా చెత్త సినిమాలు చేశానో గుర్తుచేసుకున్నారు. ఇది తనను చాలా బాధించిందని చెప్పిన వర్మ, కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పడం విశేషం.“ఇకపై మంచి సినిమాలే చేస్తాను. అలాంటి సినిమాలు చేయకపోతే నాకు ప్రాణం అవసరం లేదు.
నా తలపై పిస్టల్ పెట్టి షూట్ చేయండి,” అని వర్మ ఘటుగా ప్రకటించారు.ఇది విన్న ఆడియన్స్, వర్మ నిజంగానే మారిపోయారా అని అనుమానంతో ఉన్నారు.ఎందుకంటే ఇప్పటివరకు ఆయన పద్ధతికి ఇలాంటి మాటలు చాలా విభిన్నంగా ఉన్నాయి.ఇప్పటి వరకు వర్మ అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేవారు. కానీ ఇప్పుడు ఈ మార్పు నిజమైతే, ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న అభిప్రాయాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు ఎలాంటి టైటిల్స్, వివాదాలతో సినిమాలు తీసిన ఆయన, ఇప్పుడు మంచి కథలపై దృష్టి పెట్టాలని చెప్పడం, తనలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపుతోంది.వర్మ మాటలు నిజమేనా, లేక ఇది మరో హైప్ క్రియేట్ చేసుకోవడానికేనా అని తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. “ఇకపై నా సినిమాలు గౌరవాన్ని పెంచేవే ఉంటాయి” అనే వర్మ మాటలు అమలవుతాయా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.