సీఎం రేవంత్ ను కలిసిన కొత్త డీజీపీ

తెలంగాణ కొత్త డీజీపీగా నియమితులైన జితేందర్.. సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను డీజీపీగా ఎంపిక చేసినందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అటు కొత్త డీజీపీకి రేవంత్ అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో పాలనపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను చేపట్టారు. ఇప్పటికే పలు శాఖలకు కొత్త చీఫ్ సెక్రటరీలను నియమించారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో పాలనపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను చేపట్టారు. ఇప్పటికే పలు శాఖలకు కొత్త చీఫ్ సెక్రటరీలను నియమించారు.

జితేందర్ ఐపీఎస్ విషయానికొస్తే.. ఆయన స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. సామాన్య రైతు కుటంబంలో జన్మించిన జితేందర్.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. శిక్షణ తర్వాత ఏపీ కేడర్‌కు కేడర్‌కు ఎంపికైన జితేందర్.. మెుదటి పోస్టింగ్‌లో నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్‌తో పాటు గుంటూరు జిల్లాల ఎస్పీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. అనంతరం డిప్యూటేషన్‌పై ఢిల్లీ సీబీఐలో, 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.

అప్పాలో కొంతకాలం పని చేసిన జితేందర్.. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగానూ కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ జితేందర్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీ విరమణ ఉండగా.. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే ఛాన్స్ ఉంటుంది.