ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి, రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. చిన్న విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఈ టెర్మినల్ నిర్మాణం కోసం గత దశాబ్ద కాలంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రయత్నించినా, ఇప్పుడే సక్రమంగా పనులు ముందుకు సాగుతున్నాయి.

ప్రకాశం జిల్లాలో ఒంగోలు సమీపంలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. కొప్పోలు, ఆలూరు, అల్లూరు వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలే ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఈ ప్రాంతంలో స్థల పరిశీలన చేసి, నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు.
విమానాశ్రయం ఏర్పాటుకు పునాది పటిష్టంగా ఉండాలని, నేల పటుత్వం సహా అనేక అంశాలను సాంకేతికంగా పరిశీలించాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలంలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించబడతాయి. రన్‌వే నిర్మాణానికి అనువైన స్థలం, భూస్థితి వంటి అంశాలపై అధ్యయనం జరుగుతోంది. ఒంగోలు విమానాశ్రయం కోసం 3,150 ఎకరాల భూమిని గతంలో కేటాయించారు. అయితే వాటిలో ఎక్కువభాగం వాన్‌పిక్ భూములు కావడం, భూములపై వివాదాలు ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం చిన్న విమానాలు దిగే విధంగా 600 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికలు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ప్రకాశం జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్టు అభివృద్ధి వల్ల ప్రాంతీయ అభివృద్ధికి మేలుకలుగుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడడంతో పాటు వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వ సహకారం, కేంద్రం ఆమోదం అందిస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగంగా ముందుకు సాగనుంది.