అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భేటీ అయిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ… హమాస్ తో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందని చెప్పారు. తమ దేశంలో శాంతిని నెలకొల్పడానికి, ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడం కోసం గాజాకు సంబంధించి మూడు కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. బందీలను విడుదల చేయడం, హమాస్ సైన్యాన్ని నాశనం చేయడం, తమ దేశానికి గాజా మరోసారి ముప్పు కల్పించకుండా చూసుకోవడం తాము నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలని నెతన్యాహు తెలిపారు.

అమెరికాకు ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులలో ట్రంప్ తనకు గొప్ప స్నేహితుడని నెతన్యాహు కొనియాడారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ నేతగా తనను వైట్ హౌస్ కు ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య మైత్రికి ఇది నిదర్శనమని చెప్పారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ట్రంప్ ను అమితంగా ఇష్టపడతారని తెలిపారు.
యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ తన పరిధిని దాటి ప్రయత్నిస్తున్నారని నెతన్యాహు అన్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు, ట్రంప్ మాట్లాడుతూ గాజా స్ట్రిప్ ను స్వాధీనం చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.