నీట్‌ పేపర్‌ లీక్‌.. పాట్నా, హ‌జారిబాగ్‌ల వరకే పరిమితం: సుప్రీంకోర్టు

Supreme Court

న్యూఢిల్లీ: నీట్‌ యూజీ 2024 పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని ఇటీవల కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అందుకుగల కారణాలను వివరిస్తూ మళ్లీ తీర్పు వెలువరించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ లోపాలను ధర్మాసనం ఎత్తిచూపుతూ.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పింది.

నీట్‌ పేపర్‌ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని.. పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్‌ జరగలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రశ్నపత్రం లీకేజీ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పట్నా వరకే పరిమితమైందని.. దానిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అందుకే పరీక్షను రద్దు చేయాలనుకోలేదని.. అయితే, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని హితవు పలికింది. ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని పేర్కొంటూ.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీయేదేనని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.