రెండున్నరేళ్లలో ‘అమరావతి’ పూర్తి చేస్తాం – మంత్రి నారాయణ

వచ్చే రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ( Narayana) తెలిపారు. రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆ నివేదిక రావడానికి 2,3 నెలల సమయం పడుతుందని, మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లో 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. అమరావతికి పునఃజీవాన్ని తీసుకొస్తామన్నారు.

ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని అమరావతి నిర్మాణం చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మున్సిపల్ శాఖను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థలను ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐదేళ్లు తమ ప్రభుత్వం ఎటువంటి ఇంటి పన్నులు పెంచదని అన్నారు. చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీదన్నారు.