టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై మంత్రి లోకేష్ సమీక్ష

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

టెట్‌, డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీఓ-117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి, వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను లోకేశ్‌ ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు

ఇక టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయడంలేదని తెలిపారు. టెట్ సిలబస్ వివరాలకు https://aptet.apcfss.in వెబ్ పోర్టల్ ను సందర్శించాలని లోకేశ్ సూచించారు.