12వ రోజు కొనసాగిన నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’

Nara Lokesh ‘Praja Darbar’ continues for 12th day

అమరావతిః ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ తప్పనిసరిగా కొంత సమయం కేటాయించి వందలాది మంది నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అయితే, తమ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వారు కూడా పోటెత్తుతున్నారని నారా లోకేశ్ వెల్లడించారు.

“తొలుత మంగళగిరి ప్రజల కోసమని ప్రజాదర్బార్ మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు ప్రజాదర్బార్ కు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని, వాటిని సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాను. ఉండవల్లి నివాసంలో 12వ రోజు కూడా ప్రజాదర్బార్ కొనసాగింది. మంగళగిరి నుంచే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలి వచ్చారు.

పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు… ఉద్యోగాల కోసం యువత… సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు… విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు… తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు… ఇలా ప్రజాదర్బార్ కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని వారికి మాటిచ్చాను” అని నారా లోకేశ్ వెల్లడించారు.