ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఘటనగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నూజివీడు మండలం సీతారాంపురం వద్ద లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు.

అభిమానుల కోసం ఎన్టీఆర్ ఫ్లెక్సీ ప్రదర్శన
లోకేశ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు అక్కడ గుమిగూడారు. ఈ సందర్భంగా తారక్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ప్రదర్శించాలని కోరగా, లోకేశ్ కూడా ఆ ఫ్లెక్సీ వైపు చూపించి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఫ్లెక్సీ కనిపించగానే అక్కడున్నవారంతా కేరింతలు, ఈలలు, నినాదాలతో హోరెత్తించారు. ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమై వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఇది పార్టీలో ఎన్టీఆర్‌కు ప్రాధాన్యత ఉన్నదనడానికి నిదర్శనం అని అభిప్రాయపడుతుంటే, మరికొందరు ఇది కేవలం అభిమానుల కోరిక మేరకే జరిగిన సంఘటన అంటూ విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ మధ్య సంబంధాలు తెరమరుగైపోయినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ పార్టీలో చురుకైన పాత్ర పోషించలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే, లోకేశ్ తన పర్యటనలో తారక్‌కి సంబంధించి ఫ్లెక్సీపై స్పందించడం వల్ల ఆయన ఇంకా ఎన్టీఆర్‌ను గౌరవంగా చూసేలా ఉన్నారని కొందరు అంటున్నారు
వైరల్ అవుతున్న వీడియోపై అభిమానుల మద్దతు
ఈ వీడియోపై టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఇదే సందేశం పార్టీ పెద్దలకు కూడా అర్థం కావాలి అంటూ స్పందిస్తుండగా, మరోవైపు టీడీపీ కార్యకర్తలు నారా లోకేశ్ తీరు అభిమానులను సంతోషపరిచేలా ఉందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు, ఎన్టీఆర్ వర్గం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో దీనిపై చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఫ్లెక్సీ అంశం టీడీపీ, ఎన్టీఆర్ మధ్య సంబంధాలను కొత్తగా మలుపు తిప్పుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.