మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు చేపట్టిన నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనలు సోమవారం నాగ్ పూర్‌లో ఉద్రిక్తతకు దారి తీశాయి. విశ్వహిందూ పరిషత్ (VHP) కార్యకర్తలు మహల్ ఏరియాలో భారీ ర్యాలీ నిర్వహించగా, ఆ సమయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు ఆందోళనకారులపై రాళ్లు రువ్వడంతో నగరంలో అల్లర్లు చెలరేగాయి.
ఉద్రిక్తతకు దారితీసిన ఘటన
ఔరంగజేబ్ సమాధి తొలగింపు విషయంలో హిందూ సంఘాలు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నాయి. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాగ్ పూర్‌లో మహల్ ఏరియాలో వీహెచ్‌పీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు “ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలి” అంటూ నినాదాలు చేసారు. ఆ సమయంలో ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చి, రాళ్ల దాడి మొదలైంది. ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. దుండగులు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. భారీగా పోలీసులు రంగంలోకి దిగినా, ఉద్రిక్తతలు కొనసాగాయి.
పోలీసుల లాఠీచార్జ్, భాష్పవాయువు ప్రయోగం
అల్లర్లు తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే, కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా గందరగోళ పరిస్థితి కొనసాగింది. నాగ్ పూర్ మహల్ ఏరియాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు కర్ఫ్యూ విధించినట్లు అధికారులు ప్రకటించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. రాత్రంతా పోలీసులు టహలీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 39 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాగ్ పూర్ డీఎస్పీ వెల్లడించారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించిన వీరి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి ఫడ్నవీస్, మంత్రి గడ్కరీ స్పందన
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రజలకు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, వదంతులను నమ్మొద్దని చెప్పారు. అలాగే, అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ట్విట్టర్ ద్వారా ప్రజలను శాంతి పాటించాలని కోరారు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదు. చట్ట వ్యతిరేక చర్యలు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అంటూ ట్వీట్ చేశారు. ఔరంగజేబ్ భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకడు. హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు, హిందువులపై వివక్ష చూపినట్లు ఆవేదన వ్యక్తమవుతుంది. అందుకే, ఆయన సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. గతంలో మహారాష్ట్రలోని మరాఠా నేతలు కూడా ఈ విషయంపై స్పందించారు. మహారాష్ట్రలో సంజయ్ రౌత్ వంటి శివసేన నేతలు కూడా గతంలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్ చేశారు. నాగ్ పూర్‌లో కర్ఫ్యూ అమలులో ఉంది. పోలీసులు అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో శాంతి పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హింసకు పాల్పడ వద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.