వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నాగార్జున యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వివాదాల్లో ఉన్నారు.. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కుప్పంలో ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఇక నాగార్జున అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేయడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా ఏపీ పోలీసులు ధిక్కరించారని అంటున్నారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోడానికి ఈ అరెస్ట్ లను ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నారు.