చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “జనంలోకి జనసేన” బహిరంగ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను భయపెట్టే రాజకీయాలకు తాము భయపడబోమని, జనసేన పార్టీ న్యాయంగా, ధర్మంగా ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
నాగబాబు తన ప్రసంగంలో పెద్దిరెడ్డి భూ దోపిడీ కేసులను ప్రస్తావించారు. పెద్దిరెడ్డి అక్రమంగా భూములను కబ్జా చేసి, సంబంధిత రికార్డులను నాశనం చేయించారని ఆరోపించారు. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన కీలక పత్రాలు కాల్చివేయడం వెనుక పెద్దిరెడ్డిది కుట్ర అని అన్నారు. కూటమి ప్రభుత్వం న్యాయంగా పాలన చేస్తుందని, తప్పుదారి పట్టిన వారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హాజరుకాని పరిస్థితిని విమర్శిస్తూ, ప్రజల తరఫున గళం వినిపించే ధైర్యం వైసీపీ నేతలకు లేదని నాగబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని వైసీపీ నేతలు చెబుతుంటే, అసలు సభకు హాజరవుతారా లేదా అనే ప్రశ్నను ఆయనే లేపారు. ప్రజల సమస్యలను అంగీకరించే ధైర్యం లేని పార్టీ అధికారంలో కొనసాగడమే బాధాకరమని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిందని నాగబాబు వివరించారు. పెన్షన్లు రూ.1000 పెంచి, ఇళ్ల వద్దనే పంపిణీ చేస్తున్నామని, దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ఉచిత ఇసుక అందించడంతో పాటు, రైతులకు ధాన్యం కొనుగోలు తర్వాత 48 గంటల్లోనే డబ్బు జమ చేయడాన్ని హైలైట్ చేశారు.
ఉద్యోగ అవకాశాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు, 6 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, 4 లక్షల మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయని నాగబాబు పేర్కొన్నారు.