Nadeendla Manohar : మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో సంస్థ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సీజన్‌లో 5,61,216 మంది రైతుల నుంచి 35,48,724 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు రూ.8,138 కోట్ల నగదు అందించామని వెల్లడించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆర్ఎస్కేలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి రబీ కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మంత్రి వివరించారు.

పేదలకు దీపం-2 పథకం ప్రయోజనాలు
పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న “దీపం-2” పథకం గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. మొదటి ఉచిత సిలిండర్ పొందేందుకు 2025 మార్చి 31 వరకు గడువు ఉందని తెలిపారు. ఇప్పటివరకు 98 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు.సిలిండర్లను నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకోవచ్చని, పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లో గ్యాస్ డెలివరీ జరుగుతుందని తెలిపారు. డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన మొత్తం లబ్ధిదారుల ఖాతాలో తిరిగి జమ చేయబడుతుందని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 కు కాల్ చేయాలని సూచించారు.
అధునాతన గోదాముల ఏర్పాటు
వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రైవేటు గోదాముల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా సరుకు నిల్వలను సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా, గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కోసం హాస్టళ్లకు 1.14 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. తృణధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలో రాగులు, కొర్రలు, సజ్జలను చౌక ధరల దుకాణాల ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. రైతులను తృణధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు ప్రోత్సహిస్తామని వివరించారు.ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎండీ మంజీర్ జిలాని, కమిషనర్ సౌరబ్ గౌర్, సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యులు బోడపాటి శ్రీధర్, కడాలి ఈశ్వరి, పద్మజ, ఆనంద్, కోటి, పట్టాభి, తోట పార్థసారథి, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.