Myanmar earthquake : భూకంపం ధాటికి మయన్మార్ లో 25 మంది మృతి మయన్మార్ భారీ భూకంపం ధాటికి కుదేలైంది. రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం, దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. భయానక ప్రకృతి విపత్తుతో మయన్మార్ లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు నేలమట్టమవడంతో, శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.భూకంపం ప్రభావం రాజధాని నేపిడాలో తీవ్రంగా కనిపించింది. అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాండలే నగరంలో ఐకానిక్ వంతెన కూలిపోవడంతో, రవాణా వ్యవస్థ దెబ్బతింది. పలు ప్రాంతాల్లో ఉన్న ప్రసిద్ధ ప్రార్థనా మందిరాలు, గోపురాలు కూడా నేలమట్టమయ్యాయి. ఈ విపత్తు నేపథ్యంలో మయన్మార్ సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సహాయాన్ని కోరింది. ప్రపంచ దేశాలు మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేసింది.

థాయిలాండ్ లోనూ భూకంపం: ముగ్గురు మృతి
భూకంపం ప్రభావం మయన్మార్ ను మాత్రమే కాదు, పొరుగు దేశమైన థాయిలాండ్ ను కూడా వణికించింది. రాజధాని బ్యాంకాక్ లో ఓ భారీ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 80 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉన్నట్టు థాయిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. సహాయక బృందాలు ఇప్పటివరకు ఏడుగురిని రక్షించాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారత ప్రభుత్వం నుంచి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు భారత ప్రభుత్వం సహాయంగా ముందుకొచ్చింది. థాయిలాండ్ లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. భూకంపంతో ఇబ్బంది ఎదుర్కొంటున్న భారతీయులు ఈ నెంబర్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ హెల్ప్ లైన్ సేవలు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ విపత్తు తీవ్రతకు ప్రపంచ దేశాలు స్పందించి సహాయ సహకారాలు అందించాలని మయన్మార్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అధికారిక ప్రకటనలో తెలియజేయనున్నారు.+66 618819218