ముకేష్ కుమార్ మీనా కు కీలక పదవులు అప్పగించిన కూటమి సర్కార్

ఏపీ సార్వత్రిక ఎన్నికలను సజావుగా కొనసాగించిన ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కు సీఎం చంద్రబాబు కీలక పదవులు అప్పగించింది. ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల్లో ఉన్న ఆయన అందులో నుంచి వైదొలగి తిరిగి ప్రభుత్వంలోకి వచ్చారు. ముకేష్ కుమార్ మీనాకు ప్రభుత్వం ఎక్సైజ్, వాణిజ్య పరిశ్రమల శాఖల బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు వాణిజ్య, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ అదనపపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఈ రెండు కీలక శాఖలకూ ముకేష్ కుమార్ మీనా బాస్ గా వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి ముకేష్ కుమార్ మీనా వైదొలగడంతో ఆయన స్ధానంలో మరో ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమితులయ్యారు.

1998 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అయిన ముకేష్ కుమార్ మీనా ఎన్నికల సందర్భంగా పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున నకిలీ ఓట్ల తొలగింపు, ఎన్నికల అక్రమాలు, అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు ఇలా పలు అంశాల్లో ఎదురైన సవాళ్లను మీనా దీటుగా ఎదుర్కొన్నారు. సీఈసీకీ నమ్మకమైన అధికారిగా వ్యవహరించారు. దీంతో ఆయన్ను ప్రభుత్వంలోకి తీసుకున్నారు.