నిరాహార దీక్ష విరమించిన మోతీలాల్‌ నాయక్‌

నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం దాదాపు 9 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేసిన మోతీలాల్‌ ఎట్టకేలకు దీక్ష విరమించి నిమ్మరసం సేవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్‌ 9 రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది కానీ.. తాను దీక్ష చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పెరుగలేదన్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇన్నిరోజులు అన్నపానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశా. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్‌ లెవల్స్‌ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వచ్చినయ్‌. 25 నుంచి 35 ఏండ్ల వయస్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే. ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?. నా ఫోన్‌ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయాలి. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తాం. అన్ని పార్టీల వారినీ కలుపుకుని పోతాం. నాకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ నాయకులందరికీ కృతజ్ఞతలు. మీడియా, సోషల్‌ మీడియాకు ధన్యవాదాలు’ తెలిపారు.